15 April 2022

క‌మ‌నీయం ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రాముని క‌ల్యాణం

ఒంటిమిట్ట, 2022, ఏప్రిల్ 15: 

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం క‌మ‌నీయంగా జ‌రిగింది. విశేషంగా భ‌క్తుల విచ్చేసి క‌ల్యాణోత్స‌వాన్ని తిల‌కించారు. ఈ క‌ల్యాణంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి గౌ.శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

క‌ల్యాణానికి ముందు రాత్రి 7 గంటలకు కాంతకోరిక నిర్వహించారు. రాములవారి కల్యాణానికి సంబంధించి సీతమ్మవారి కోరికను శాస్త్రరీత్యా తెలుసుకోవడాన్ని కాంతకోరిక అంటారు. రాత్రి 7.30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్‌ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోకకల్యాణం కోసం సంకల్పం చేయించారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు, వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్నిప్రతిష్టాపన తరువాత జిరగుడ ప్రక్షేపనం చేసి మంగళాష్టకం, చూర్ణిక పఠించారు. ఆ తరువాత మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. అనంతరం లాజహోమంలో సీర్పాడళ్‌ ఆలపించారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణఘట్టం పూర్త‌యింది.

భ‌క్తులంద‌రికీ ముత్యంతో కూడిన త‌లంబ్రాలు పంపిణీ 

శ్రీ సీతారాముల క‌ల్యాణానికి విచ్చేసిన భ‌క్తులంద‌రికీ టిటిడి ముత్య‌ంతో కూడిన త‌లంబ్రాల‌ను పంపిణీ చేసింది. భ‌క్తులు ఎంతో భ‌క్తిభావంతో వీటిని స్వీక‌రించారు. శ్రీ‌వారి సేవ‌కుల సాయంతో వీటిని భ‌క్తుల‌ను అంద‌జేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ కె.సత్యనారాయణ, శ్రీమతి రోజా, ఎంపీలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ అవినాష్ రెడ్డి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆకేపాటి అమరనాథ రెడ్డి, శాసన సభ్యులు శ్రీ మేడా మల్లిఖార్జున రెడ్డి, శ్రీ పి. రవీంద్రనాథ రెడ్డి, శ్రీ జి. శ్రీకాంత్ రెడ్డి, శ్రీ కొరుముట్ల శ్రీనివాసులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ మారుతి ప్రసాద్, వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు, జిల్లా ఎస్పీ శ్రీ అన్బు రాజన్ తదితరులు పాల్గొన్నారు.


#Sriramanavami_Kalyanotsavam #Vontimitta #SriKodandaRamalayam #KodaramuduKalyanotsavam #CmYSJaganMohanReddy #ApCm #SnapanaTirumanjanam #Trumala_Tirupati_Devasthanams #Alipiri #Ghat_Road #Tirumala_Updates #Tirumala_Information #Svbcttd #TTD #Tirumala_Temple_Information #Tirumala_Journey #Live_Tirumala






















 

No comments: