15 April 2022

రాములవారి కల్యాణోత్సవంలో ఆద్యంతం భక్తిభావాన్ని పంచిన సంగీత కార్యక్రమాలు

తిరుపతి, 2022 ఏప్రిల్ 15: 

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా సాయంత్రం నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆద్యంతం భక్తిభావాన్ని పంచాయి.

మధ్యాహ్నం 3.45 గంటల నుండి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాపకులు శ్రీ వైఎల్.శ్రీనివాసులు బృందం నాద‌స్వ‌రం-డోలు వాద్యం మంగళప్రదంగా ప్రారంభమైంది. ఆ తరువాత ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాపకురాలు డా. వందన పలు భక్తి కీర్తనల ద్వారా సీతారామ గాన నివేదన చేశారు.

ఆకట్టుకున్న అదివో అల్ల‌దివో క‌ళాకారుల‌ గీతాలాపన

అనంతరం ఎస్వీబీసీ అదివో అల్ల‌దివో కార్య‌క్ర‌మం క‌ళాకారుల‌ భ‌క్తిసంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. ఇందులో హైదరాబాదుకు చెందిన నంబూరి వ్యూహ “రామచంద్రుడితడు రఘువీరుడు…..”, తిరుపతికి చెందిన సుషమ “భళి భళి రామ….”, హైదరాబాదుకు చెందిన శ్రీధృతి “రామ రామభద్ర రవివంశ రాఘవ…” కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. అదేవిధంగా తిరుపతికి చెందిన మోహనకృష్ణ “వీడెవో అల విజయరాఘవుడు…”, తిరుపతికి నరేష్ చెందిన “సీతా సమేత శ్రీరామ…”, తిరుపతికి చెందిన శివశ్రవణ్ “రాముడు రాఘవుడు రవికులడీతడు…”, చెన్నైకి చెందిన పవిత్ర “ఇందులోనే కానవద్దా ఈతడు దైవమని…., హైదరాబాదుకు చెందిన శర్మిష్ట, సర్వజ్ఞ “ఎదురా రఘుపతి…” అనే కీర్తనలను మృదుమధురంగా ఆలపించారు.

భక్తిసాగరంలో ముంచెత్తిన విఠల్ దాస్ మహరాజ్ నామసంకీర్తనం

సాయంత్రం 6.30 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు జరిగిన త‌మిళ‌నాడుకు చెందిన శ్రీ విఠ‌ల్‌దాస్ మ‌హ‌రాజ్ బృందం నామ‌సంకీర్త‌నం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. భజన సంప్రదాయంలో ఆలపించిన కీర్తనలకు పలువురు భక్తులు గొంతు కలిపి నృత్యం చేశారు.


 

No comments: